30, మే 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతీ


"మనందరమూ జీవితములో జ్ఞానం సంపాదించడానికి తపన పడాలి. ఒక్క జ్ఞానముతో మాత్రమే మనము ఎటువంటి కష్టాలనైనా, బాధలనైనా ఓర్చుకుని సహించగలము.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, మానవ జన్మ ఎత్తినందుకు, ప్రతీ ఒక్కరికీ సుఖాలతో పాటు, కష్టాలు కూడా జీవితములో ఉండి తీరుతాయి. బాగా ఐశ్వర్యం కలిగిన వాడో లేక పదవులలో బాగా ఉన్నత స్థానం చేరుకున్నవారినో చూసి మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాము, వారు ఎంత సుఖపడుతున్నారో, వాళ్ళకి అసలు కష్టాలే లేవు అని. అలా అనుకుని, మనం కూడా జీవితములో చాలా సమయాన్ని ఈ ధనము/కీర్తి/పదవుల వేటలోనే వెచ్చిస్తున్నాము. యథార్ధంగా, అటువంటి ఐశ్వర్యవంతులను, లేదా పెద్దపెద్ద పదవులలో ఉన్నవారిని అడిగితే, వాళ్లకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తాయి.

నిజానికి, ప్రతీ మనిషీ తనకున్న కష్టమే అందరి కష్టం కన్నా పెద్దది అనుకుంటూ ఉంటాడు, కాబట్టే, ఒక కష్టం రాగానే, ఇతరుల నుంచి సానుభూతి కోరుకుంటూ ఉంటాడు. అసలు మనం పుడుతూనే, మనం ఈ జన్మలో ఏ ఏ కష్టాలు అనుభవించాలో, మన పూర్వ కర్మానుసారం, నిర్ధారితమై పుట్టాము. అంటే, ప్రతీ ఒక్కరికీ కష్టములు తప్పవు. అయితే, ఈ కష్టాలను తట్టుకోగలగడం అనేది, కేవలం జ్ఞానం పొందడం వల్ల మాత్రమే సాధ్యము".

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి !!

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత

"గురుగుహా" అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి. గురుగుహ అనే నామానికి స్థూల సూక్ష్మ కారణ అర్ధాలు మూడు ఉన్నాయి.

మొదటి స్థూల అర్ధం - గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహలోనే ఉన్న గురుస్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని. ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ - హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు.

శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ 'గురుగుహా' అనే మకుటంతో ఉంటాయి. అది ఏ దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి చేసిన కీర్తన అయినా సరే, గురుగుహా అనే నామం ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ శాస్త్రి గారిని కాశీ పట్టణంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఐదు సంవత్సరాలు పాటు గురు సేవ చేస్తూ, అటు రోజూ విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ గురువు వద్ద సంగీతం అభ్యసించారు. ఒకనాడు, ఈయన గురుభక్తికి మెచ్చిన వారి గురువు గారు, ఒకనాడు గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, శిష్యుడైన ముత్తుస్వామి దీక్షితార్ గారిని పిలిచి, కళ్ళుమూసుకుని, నదిలో మునిగి, చేతికి తగిలిన వస్తువు తీసుకోమని చెప్తారు. అప్పుడు దీక్షితార్ గారికి నదిలో ఒక అద్భుతమైన వీణ లభిస్తుంది, గురు అనుగ్రహం కలగడం చేత గంగా నది ఆయనకి ఆ వీణ బహూకరించినది. ముత్తుస్వామి దీక్షితార్ గారికి దొరికిన ఆ వీణ చాలా విలక్షణమైనది, అందులో యాళి పైకి ఉంటుంది. ఇక అలాంటి వీణ మరెక్కడా లేదు. ఇది జరిగిన తర్వాత ఆయన గురువు గారు శరీరం విడిచి, శివ సాయుజ్యం పొందుతారు. చివరలో ఆయన గురువైన శ్రీ చిదంబరనాథ శాస్త్రి గారు, తదనంతరం ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణి వెళ్లమని ఆదేశిస్తారు.

అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ దక్షిణదేశం బయలుదేరి తిరుత్తణి అనే ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకుంటారు. తిరుత్తణి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉండగా, అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారే అక్కడికి వచ్చి ...."ముత్తుస్వామి దీక్షితార్!! ముత్తుస్వామి దీక్షితార్!! ఏదీ నీ నోరు తెరు..." అని ఆయన నోటిలో పటిక బెల్లం వేస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ గారు కళ్ళు తెరిచి చూసే సరికి అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్యుడు కనబడడు. అంతే అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఆయన నోటి నుండీ సుబ్రహ్మణ్యుడిపై అద్భుతమైన కీర్తనలు వచ్చాయి. వాటినే తిరుత్తణి కీర్తనలు అంటారు. ఇలా సుబ్రహ్మణ్య అనుగ్రహం ప్రత్యక్షంగా పొందినందుకు, ఆయన కీర్తనలన్నిటిలోనూ, 'గురుగుహా' అనే మకుటం వేసి కీర్తనలు చేశారు దీక్షితార్. దీక్షితార్ గారు కాశీలో ఆయన చేసిన గురు శుశ్రూషకి మెచ్చిన సుబ్రహ్మణ్యుడు దీక్షితార్ కి అఖండమైన సంగీత పరిజ్ఞానాన్ని కటాక్షించాడు. అందుకే ముత్తుస్వామి వారు తిరువారూర్ లో చేసిన పంచలింగ కృతులలో ఒక కృతిలో ఇలా అంటారు.."జ్ఞాన ప్రదాన గురుగుహ రూప చిదానందనాథ స్వరూప ప్రకాశేన" అని. అంటే ఆయన గురువు చిదానందనాథ స్వామి వారే గురుగుహుడు అని.

"గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు, సర్వ జీవుల హృదయములో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యుడు, ఆయనయే గురు స్వరూపం. సుబ్రహ్మణ్యుడు గురువుగా కేవలం ముత్తుస్వామి దీక్షితార్ గారికే కాదు, సాక్షాత్తు శంకరుడికి కూడా గురువుగా ప్రణవార్ధం బోధించాడు. అందుకే ఆయనని స్వామినాథ అని కూడా అంటారు. ఇక్కడ శంకరుడికి తెలియదా ప్రణవార్ధం, సుబ్రహ్మణ్యుడు బోధించాడు అంటే అది శంకరుడికి అవమానం కదా అని అనుకోకూడదు. ఏ తండ్రికైనా తన పుత్రుడి చేతిలో పొందిన ఓటమి మరింత ఆనందాన్నిస్తుంది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నారు కదా. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు సంపూర్ణ గురు తత్త్వంతో కూడిన సర్వ జీవుల జీవుల హృదయాలలో ఉన్నవాడు కనుక "గురుగుహ".

రెండవ సూక్ష్మ అర్ధమ్ -
గురు అంటే బాగా పెద్దదైన, గుహా అంటే చాలా చిన్నది సూక్ష్మమైనది. అంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా పెద్దదైన వాడూ ఆయనే, అన్నిటికన్నా చిన్నదైన పరమాణువు స్వరూపం ఆయనే, అంటే సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని అర్ధం, దీనినే అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అని విష్ణుసహస్రంలో ఉంది, అన్నిటికనా బాగా పెద్దది, బాగా చిన్నది, బాగా చిక్కినది, బాగా లావైనది, అన్ని గుణములు కలవాడు, ఏ గుణములు లేనివాడు అని కదా. అంటే పరబ్రహ్మ తత్త్వాన్ని చెప్పడం.
దీనినే భగవద్గీతలో "కవిం పురాణమనుశాసితారం అణోరణీయఁసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్" అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా.

మూడవ కారణ అర్ధం -
గురుగుహా అంటే - గురు అంటే నిర్గుణమైన పరమశివునికి సంకేతం, గుహా అంటే గుహ్య శక్తి అయిన అమ్మవారికి సంకేతం, అమ్మ అయ్యవార్ల క్రీడా ఫలితం గురుగుహా. ఈ విశ్వం అంతా కూడా నిర్గుణమైన పరమశివుని మరియు గుహ్యమైన శక్తి స్వరూపిణి యొక్క క్రీడగా వర్ణించారు. అమ్మ అయ్యల క్రీడయే గురుగుహా, అందుకే స్కందః అని కూడా అన్నారు స్వామిని, స్కంద అంటే జారి పడినది అని అర్ధం. ఇక్కడ జారి పడడం అంటే source కి, destination కి లింక్ తెగిపోదు, ఉదాహరణకి సూర్య కిరణాలు. సూర్యుని కిరణాలు సూర్యుని నుంచి బయలు దేరి భూమిని తాకుతాయి, అంతే కానీ అక్కడ ఒక కిరణం బాణంగా బయలుదేరి భూమిమీద పడదు. సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అందుకే ఆదిత్య హృదయంలో కూడా శివః స్కందః ప్రజాపతిః అని సూర్యుని నామాలలో కూడా స్కంద నామం వచ్చింది.


సర్వం శ్రీగురుగుహాయార్పణమస్తు.

29, మే 2013, బుధవారం

శ్రీ పరమాచార్య వాణి - గురుభక్తి ప్రాశస్త్యం


"వేదాంత దేశికులు, తమ గురువుని భగవంతుడి కన్నా అధికంగా భావించేవారు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడినది - ఈశ్వరుడు కనుక ఆగ్రహిస్తే, గురువు రక్షించగలుగుతాడు, కానీ గురువే ఆగ్రహిస్తే త్రిమూర్తులలో ఎవరూ రక్షించడానికి ముందుకు రారు. మనం సంపూర్ణ అంకిత భావముతో, విశ్వాసముతో, ఎటువంటి భేషజములు లేకుండా గురువు వద్ద శరణాగతి చేస్తే, గురువే మనల్ని దుఃఖముల నుండి రక్షించి, మోక్షమార్గం చూపిస్తాడు. కానీ ఈ రోజులలో గురుభక్తి కొరవడడం వలన ఈశ్వరుని యందు భక్తి కూడా జనుల హృదయాలలో తగ్గిపోతోంది".

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

28, మే 2013, మంగళవారం

శ్రీ పరమాచార్య వాణి - జీవితం యొక్క లక్ష్యం ఎలా నిర్ణయించుకోవాలి


"సూర్యునికి అభిముఖంగా నడిస్తే, నీడ మన వెనుకనే మనకి తెలియకుండా మనతో వస్తుంది. సూర్యుని లక్ష్యంగా పెట్టుకుని నడిచినట్టుగా, అదే విధంగా శాస్త్రములు చెప్పిన లక్ష్యాలను సాధించడం కోసం మనం నడుస్తూ ఉంటే, ధనము, కీర్తి వాటంతట అవే మన వెనుక వస్తాయి. (సూర్యుని వైపు నడుస్తూ ఉండగా మన నీడ మనతో వచ్చినట్లు.) అలా కాకుండా, మనం సూర్యుడిని విడిచిపెట్టి, వెనుకకు తిరిగి నీడని అనుసరించడం మొదలు పెడితే, మనం ఆ నీడని ఎన్నటికీ పట్టుకోలేము. చివరికి ఆ నీడ మనల్ని వదిలేస్తుంది. అంటే మనం శాస్త్రములు విధించిన సూర్యుడి వంటి ఉన్నతమైన లక్ష్యాలను వదిలిపెట్టి, ధనము/కీర్తి అనే అల్పమైన (నీడ వంటి) లక్ష్యాల వెనుక పడితే, అవి ఒకనాడు మనల్ని విడిచిపెట్టి పోతాయి. కాబట్టి శాస్త్ర విహితమైన ఉన్నత లక్ష్యాలను మాత్రమే మనం జీవితం యొక్క ప్రథాన లక్ష్యాలుగా ఉంచుకుని నడవాలి, మిగతా ధనము, కీర్తి వగైరా అనుషంగికముగా, మనకి ఎంత అవసరమో ఈశ్వరుడే కటాక్షిస్తాడు".

శ్రీపరమాచార్య స్వామి వారి పై వాక్కులను చదివాక, పూజ్య గురువు గారు శ్రీ రామాయణం ప్రవచనం చేస్తూ ఉండగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేమిటంటే...
"నేను ధనము, కీర్తి, ఇంద్రియ సుఖాలు, సంసారము అనే గొడవలో పడి, నా జీవితపు ప్రథాన లక్ష్యం విస్మరిస్తున్నానా?? అని ప్రతీ మానవుడు తరచుగా ఆత్మపరిశీలన (self-check) చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మనం జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని/లక్ష్యాన్ని సాధించడంలో, అసలు మన జీవిత ప్రథాన ప్రయోజనాన్ని విస్మరిస్తాము. మనం ఏదైతే లక్ష్యం కోసం అత్యధిక సమయం, శ్రమ, ఆలోచనలు ఖర్చు చేస్తున్నామో, అవి మనల్ని మన యొక్క పరమ ప్రయోజమైన ఆత్మోన్నతి వైపుకు తీసుకువెళ్ళేందుకు దోహదపడుతున్నాయా... అని ఆలోచించుకోవాలి.

ఇక్కడ పూజ్య గురువు గారు మరొక మాట కూడా చెప్పారు..."డబ్బు, కీర్తి సంపాదించవద్దని మన శాస్త్రం ఎన్నడూ చెప్పలేదు. ధర్మబద్ధముగా, నీతిగా డబ్బు సంపాదించమని మన శాస్త్రం చెప్పినది. అలాగే సత్కీర్తి సంపాదించడమూ తప్పు కాదు. కానీ శాస్త్రం అన్నిటినీ ధర్మంతో ముడివేయమని చెప్పినది. ధనం సంపాదించడం అనేది తృష్ణగా మారకూడదు, కీర్తి సంపాదించడం అనేది కీర్తి కండూతిగా మారకూడదు. ఇలా మారితే, ధనార్జన తృష్ణ వల్లన, కీర్తి కండూతి వలన, మనిషి తన యొక్క పరమ పద లక్ష్యాన్ని విస్మరించి, విచక్షణ కోల్పోయి, ఎంతో విలువైన ఈ మానవ జన్మ వృధా చేసుకుంటాడు.

అందుకనే ఎప్పుడూ గురువాక్య శ్రవణం చేస్తూ ఉంటే, మన జీవితానికి ఏది పరమ లక్ష్యమో, అలాగే ఇహములో కావలసిన విభూతులను కూడా ధర్మ బద్ధముగా ఎలా సంపాదించాలో, అలా సంపాదిస్తున్నా, ఆయా విభూతుల యందు లౌల్యం పెట్టుకుని క్రిందకి పడిపోకుండా ఉండగలిగే ఇంద్రియనిగ్రహాన్ని, తపో పటిమని గురువు గారు కటాక్షిస్తారు.

అందుకనే పెద్దలు గురువు యొక్క వాక్కులను సింహనాదం అన్నారు. అడవిలో సింహము యొక్క నాదం వింటే, మిగతా జంతువులన్నీ చెల్లాచెదురై పారిపోతాయి. అలానే గురువు యొక్క సింహనాదం విన్న శిష్యుడికి, అతనిలోని ఆసురీ గుణాలు (కామ,క్రోధ, మద మాత్సర్యాలు వగైరా..) దూరంగా వెళ్ళిపోతాయి, అంతే కాక, గురువు యొక్క పాదములు పట్టుకుంటే, గురువు యొక్క అనుగ్రహంతో, ఇహములో తనకి కావలసినవన్నీ ధర్మబద్ధముగా సమకూరుతాయి, గురువాక్యములను ఆచరణలో పెట్టి సాధన చేయగా చేయగా... ఒకనాడు అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని కూడా గురువు కటాక్షిస్తాడు.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

27, మే 2013, సోమవారం

శ్రీ పరమాచార్య వాణి # పాపపుణ్యముల విచారణపై అర్జునుడికి శ్రీకృష్ణ సందేశం


"మహాభారత యుద్ధం చేయడానికి ముందు, "బంధు మిత్రులను యుద్ధంలో సంహరించి, రాజ్యాన్ని పొందడం పాపం కాదా?" అని అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మని అడుగుతాడు. ఈ ప్రశ్నకి సమాధానం గీతలోనే శ్రీకృష్ణపరమాత్మ చెప్పి ఉన్నారు. ఇక్కడ సాంరాంశం ఏమిటంటే, మన కంటికి 'క్రూరము' గా లేక 'చెడు' గా కనిపించినవన్నీ పాపభూయిష్టమైన కర్మలు కానవసరం లేదు. బాహ్యంలో ఇతరులకు నొప్పి కలిగించినట్టుగా కనబడిన ఒక చర్య, మొత్తం లోకానికి మేలు చేకూర్చగలిగితే అది పాపం కాదు.
ఇలా అయితే ఒక సందేహం కలుగవచ్చు. మరి ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పాపం కానిది లేదా పుణ్యమో ఎలా నిర్ధారించేది? గీతలోనే కృష్ణ పరమాత్మ దీనికి సమాధానం చెప్పారు.
"కామముతో మరియు ద్వేషముతో ప్రేరేపింపబడిన చేష్టితములు పాపముగానూ" - "కామము మరియు ద్వేషము అనేవి లేకుండా, కేవలం లోకక్షేమాన్ని ఉద్దేశించి చేసే పనులు పుణ్యములుగానూ, అటువంటి లోకక్షేమకారక కార్యములలో కొన్ని, బాహ్యంలో క్రూరముగా కనిపించినా అవి పాపముగా పరిగణింపబడవు" అని గీతాచార్యుడి వాక్కు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

26, మే 2013, ఆదివారం

శ్రీ పరమాచార్య వాణి - నిత్య సత్కర్మాచరణ ఆవకశ్యత

"మన వద్ద ఒక రాగి పాత్ర ఉన్నదనుకోండి, దానిని ఈ రోజు శుభ్రం చేస్తే తళ తళా మెరుస్తుంది, మరి రేపు లేక ఎల్లుండి మాటేమిటి? రాగి పాత్రని ప్రతీ రోజూ శుభ్రం చేయకపోతే, మళ్ళీ మలినం పట్టినట్లుగా, మన మనసు కూడా ప్రతీ రోజూ మనం విహితకర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మన మనసు మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మాచరణము చేయగా చేయగా, ఒకనాడు చిత్తశుద్ది ఏర్పడి, ఆపైన ఆత్మ దర్శనం అవుతుంది. అలా ఒక్కసారి ఆత్మదర్శనం పొందాక, ఇక ఇలా ప్రతీ రోజూ విహితకర్మాచరణ, సత్కర్మలు వగైరా ఏమీ చేయనక్కరలేదు. కానీ ఆ స్థితిని పొందేవరకు వేదం చెప్పినట్లుగా విహిత కర్మలు, సత్కర్మలు చేయవలసినదే".

ఈ విషయమై, పూజ్య గురువు గారి వాక్కుల నుంచి, నాకు గుర్తు ఉన్న సారాంశం...

"అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడ్డ మహాపురుషులు మన ఈ భరత ఖండములో అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి భగవాన్ రమణులు. రమణుల వంటి మహాపురుషులు ఏమి చెప్తారో అది మనకి శిరోధార్యం తప్ప, రమణులు చేసినవన్నీ మనకి ఆచరణీయము కావు. వారు తురీయావస్థని దాటి ఉన్న మహాత్ముడు, ఆయనలా మనం చేయాలనుకోవడం తప్పు. అందుకే మహాత్ములను ఎన్నటికీ అనుకరించవద్దు. మహాత్ములు చెప్పిన బోధలను మనం ఆచరణలో పెడితే చాలు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయరు అని నాబోటి అల్పుడు వారిని చూసి, నేను కూడా ఉన్నదంతా ఒకటే కదా అనే కృతక వైరాగ్యం తెచ్చిపెట్టుకునో, మనసులో ఉంటే చాలండీ... చేస్తేనే భక్తి ఉన్నట్లా అనో మెట్ట వేదాంతం కబుర్లు చెప్పుకునో, సంధ్యావందనం మానేసాననుకోండీ, ఇక అంతకన్నా భ్రష్టత్వం మరొకటి ఉండదు.

అందువల్ల, మహాత్ముల స్థాయికి వెళ్ళేవరకు,
ప్రతీ ఒక్కరికి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టీ, వేదం విహించిన నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, సత్కార్యాలు ఆచరించవలసినదే. రాగి పాత్ర ఉంటే ప్రతీ రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నట్లు, మనకి చిత్తశుద్ధి కలిగేవరకు విహితకర్మాచరణ ప్రతీ రోజూ చేస్తూ ఉండవలసినదే".
 

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

25, మే 2013, శనివారం

శ్రీ పరమాచార్య వాణి - సత్కర్మాచరణ ఆవకశ్యత

"ఒక రాగి పాత్రను ఒక పది సంవత్సరాల పాటు ఒక బావినీటిలో పడవేసి ఉంచారనుకోండి, ఆ తర్వాత ఎంత సేపు దానిని చింతపండుతో రుద్దితే, ఆ పాత్రకి పట్టిన కిలుం వదిలిపోతుంది? రాగి పాత్రని మనం ఎంతగా రుద్ది శుభ్రం చేస్తే, అది అంతలా మెరుస్తుంది. అదే విధముగా మన మనసు కూడా ఎన్నో సంవత్సరాలపాటు చెడు (పాప) కర్మలను చేయడం వలన, చెడు మాట్లాడడం వలన మలినం అయిపోయింది. మన మనసు మళ్ళీ పవిత్రం అవ్వాలంటే, ఎన్నో మంచి పనులను, సత్కార్యాలను చేస్తూ ఉండడం వల్ల, ఆ చెడ్డ కర్మల వల్ల కలిగిన మాలిన్యం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది".

శ్రీపరమాచార్య స్వామి వారి పై బోధకి సంబంధించి, పూజ్య గురువు గారి వాక్కుల ద్వారా నేను తెలుసుకున్న మరి కొంత వివరణ....


ఇక్కడ మంచిపనులు  అంటే, ఏ కర్మలను/పనులను వేదం ఒక వ్యక్తికి 

విహిత కర్మలుగా గుర్తించినదో ఆ కర్మలను క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం, ఏ కర్మలను చేయవద్దు అని నిషిద్ధ కర్మలుగా వేదం చెప్పినదో, వాటిని చేయకుండా ఉండడం. విహిత కర్మాచరణ చేస్తూ ఉండడం, నిషిద్ధ కర్మల జోలికి కూడా వెళ్లకుండా ఉండడం, గురువులను, పెద్దలను సేవించడము, గురువు గారి అనుమతి/సూచనల మేరకు మాత్రమే దానములు/లోకోపకార పనులు చేయడము, సత్సాంగత్యము నెరపడము.
మంచి పనులు చేయమన్నారు కదా... ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వాళ్లకి మన ఇచ్చ వచ్చినట్లు దానాలు చేసేస్తే "నువ్వు పాడైపోతావు" అని శాస్త్రం చెప్పినది. అందుకే, మనం ఒక మంచి పని అనుకుని, ఆ పని చేసేముందు, గురువుల/పెద్దల అనుమతితో చేయడం మంచిది అని పూజ్య గురువు గారి వాక్కు.


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

24, మే 2013, శుక్రవారం

శ్రీ పరమాచార్య వాణి - కామక్రోధములను అదుపులో పెట్టాలి


"ఒక కోరిక తీరగానే వెనువెంటనే మరో కోరిక పుడుతుంది, అదే ఏదైనా కోరిక నెరవేరకపోతే, ఆ కోరిక తీరకపోవడం వల్ల వచ్చిన దుఃఖం క్రోధంగా పరిణమిస్తుంది. ఈ కామక్రోధాల వలలో చిక్కిన వ్యక్తి నెమ్మదిగా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి, పోను పోను అతను చేసే అన్ని పనులు కూడని రీతిలో/చెడుగా చేసే దిశగా వెడతాడు. ఎవరైతే ఈ కామాన్ని, ఒక యజమాని సేవకుడిని అదుపులో పెట్టినట్లు, అదుపులో పెట్టుకుంటాడో, వాడు మాత్రమే, ఆత్మ దర్శనం వైపు అడుగులు వేయగలుగుతాడు".

ఇక్కడ శ్రీ పరమాచార్య స్వామి వారు చెప్పిన వాక్కులతో పాటు, పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కొన్ని మాటలు కూడా స్మరిద్దాము...

"మొదటగా ఇక్కడ కామం అంటే ఎల్లప్పుడూ స్త్రీ పురుష సంబంధమైన తుచ్ఛ కామం ఒక్కటే కాదు అని మనం అర్ధం చేసుకోవాలి. అన్ని రకాల కోరికలను కామం అనే అంటారు. ఈ కామాన్ని ఎవడు అదుపులో పెట్టుకుంటారో వాడు ఆత్మ దర్శనం పొందే దిశగా అడుగులు వేస్తాడు. అదుపులో పెట్టడం అంటే త్రొక్కిపెట్టడం కాదు. (
కామాన్ని త్రొక్కిపెడితే, అది ఒకనాడు ప్రతిఘటించి త్రాచుపాములా కాటువేయగలదు, అప్పుడు ఇన్నాళ్ల తపస్సు కూడా వ్యర్ధం అవుతుంది. దీనికి ఉదాహరణ రావణాసురుడు) అందుకే మన శాస్త్రం, దీనిని ధర్మంతో ముడి వేసింది. ధర్మముతో కూడిన కామము, ధర్మముతో కూడిన అర్ధములను, శాస్త్రం/వేదం చెప్పినట్లుగా అనుభవించవచ్చు. ఈ ధర్మము, అర్ధము, కామము అనే మూడు పురుషార్ధాలను పట్టుకుంటే, నాలుగవ పురుషార్ధమైన మోక్షం అనుషంగికము.

అర్ధ, కామములను రెండిటినీ ధర్మముతో ముడి వేసి పట్టుకున్నవాడికి, మోక్షం అడగకుండానే వస్తుంది అని పూజ్య గురువు గారి వాక్కు.

అందుకే పూజ్య గురువు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మనం ధర్మబద్ధముగా అర్ధమును సంపాదిస్తూ, ధర్మబద్ధముగా కామము అనుభవిస్తూ ఉంటే, నెమ్మదిగా మనలో ఒక విచారణ మొదలవుతుంది, మనం ఏదైతే సుఖము అనుకుని దీనిని పట్టుకున్నామో .. ఇది అసలు సుఖమా? అని. ఉదాహరణకి నాకు
చక్కెర పొంగలి తినడం అనే కోరిక పుట్టింది, నా ధర్మపత్నికి ఈ రోజు, స్వామి వారికి నివేదన కోసం చక్కెర పొంగలి చేయమని చెప్పాను, తీరా భార్య ప్రసాదం తీసుకువచ్చి కంచంలో వడ్డిస్తే, ఒకసారి తినగానే సంతోషం, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ భార్య తీసుకువచ్చి  అదే చక్కెరపొంగలి వడ్డించేస్తోందనుకోండి, అప్పుడు వెగటు పుడుతుంది... అప్పుడు ఇప్పటిదాకా చక్కెర పొంగలి కావాలి అన్నవాడు, వెగటు పుట్టి వద్దంటాడు.

అంటే ఏమిటి దానర్ధం, ఈ క్షణానికి 'సుఖము'గా కనబడినది, కాస్సేపటికి 'దుఃఖము'గా పరిణమించినది. అంటే నేను దేనినైతే సుఖము సుఖము అనుకుని తిరుగుతున్నానో అది నిజమైన సుఖము కాదు అన్న భావన మనసులో స్థిరీకరింపబడి, ఒకనాడు వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలగడమే, జ్ఞానమును పొంది, తనలోనే ఉన్న భగవంతుడిని దర్శించి, తరగని ఆత్మానంద స్థితిని అనుభవిస్తాడు.

అలా ఆత్మ స్థితిని చేరుకోవాలంటే ప్రథానమైన మెట్టు ధర్మము. ధర్మముతో అర్ధ, కామములను పట్టుకుని, ఈశ్వరుడు ఇచ్చిన దానిలో, శాస్త్రము, గురువు చెప్పినట్లుగా జీవితాన్ని గడపితే, గురువు అనుగ్రహంతో, మళ్ళీ ఈ జననమరణ చక్రములో పడకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య సన్నిధిని పొందుతాము.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

23, మే 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలి


"మనం ఎవరినైనా, వారిలో ఉన్న సద్గుణాలను నిజాయితీగా ప్రశంస చేయడం వల్ల, ఆ వ్యక్తి మరింత ప్రోత్సాహము పొంది, ఆతనిలో ఉన్న ఆ సద్గుణములను మరింత వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాగని ప్రశంస చేయడంలో తగు జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదే పనిగా ప్రశంస చేయడం సరికాదు, ఇది చాలా సున్నితమైన అంశం. ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలని విజ్ఞులైన పెద్దలు చెబుతారు. స్నేహితులు, బంధువుల గురించి, వారిని ప్రత్యక్షంగా ప్రశంస చేయడం కన్నా, ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి సద్గుణములను ప్రశంసించడం మంచిది. యజమాని, తన సేవకుడికి అప్పజెప్పిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాతనే ప్రశంస చేయాలి. ఒక తండ్రి తన కొడుకుని ప్రత్యక్షంగా ఎప్పుడూ ప్రశంస చేయకూడదు".

యజమాని సేవకుడిని ప్రశంస చేసే విషయంలో గొప్ప ఉదాహరణ, శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ దర్శనం చేసి వచ్చిన హనుమని కౌగలించుకుని, హనుమా నువ్వు నా సోదరుడు భరతుడితో సమానం, నీ ఋణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను, నీవు చేసిన సహాయం నాలో జీర్ణమైపోవుగాక అని చెప్తారు కదా. పైన యజమాని సేవకుడిని ఎప్పుడు ప్రశంసించాలి అని చదువుతూ ఉంటే, శ్రీరామ హనుమల ఆలింగనం గుర్తుకు వచ్చింది.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

22, మే 2013, బుధవారం

శ్రీ పరమాచార్య వాణి - గురువైభవం

"గురువు సాక్షాత్తు కరచరణాదులతో నడయాడే ఈశ్వరుడు. గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడికి, గురువుకి ఒక్కటే తేడా. ఈశ్వరుడు సృష్ఠి, స్థితి లయములనే మూడు పనులు చేస్తూ ఉంటారు, గురువు ఈ మూడూ చెయ్యనవసరంలేదు. మనం గురువు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచితే, భగవంతుడిలో చేర్చేందుకు కావలసిన జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. మనకి ఒక గురువు లభించనప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా భగవంతుని పాదములు పట్టుకోవాలి".

పైన చెప్పిన పరమాచార్య స్వామి వారి బోధను చదివాక మరియు పూజ్య గురువు గారి వాక్కుల నుంచి నాకు అర్ధం అయిన సారాంశం...


"అందుకే కదా గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని కదా గురుగీతలో శంకరుడు చెప్పారు. త్రిమూర్త్యాత్మకుడైన గురువుని నమ్మితే, గురువు యొక్క అనుగ్రహంతో ఈశ్వరుడిలో కలిసేలా చేస్తాడు. అదే మనకి గురువు లభించకపోతే, తదేక దీక్షతో మన ఇలవేల్పు/కులదైవాన్ని/ఇష్టదైవాన్ని అనన్య భక్తితో కొలుస్తూ ఉంటే, ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు, ఒకనాడు తానే స్వయంగా గురువు రూపంలో వచ్చి, మనకి జ్ఞాన భిక్ష పెట్టి మనల్ని అంత్యమున ఆయనలో చేర్చుకుంటాడు. అంటే గురువు లభించాక భగవంతుడిని పూజించనక్కరలేదు అని కాదు దీని భావం, గురువు లభించని పూర్వం మనం చేసే పూజతో పోలిస్తే, గురువు లభించిన తర్వాత మనం చేసే పూజలో ఊహించలేనంత ఉన్నతి ఉంటుంది. గురువు లభించిన తర్వాత, ప్రత్యక్షంగా గురువుకి చేసే సేవ మరియు గురుబోధలననుసరించి, మనం చేసే వైదిక కర్మాచరణ అన్నీ పరిపూర్ణత్వం పొంది,  తద్వారా, గురువు అనుగ్రహంతో చిత్తశుద్ధి కలిగి, ఆపై గురువు అనుగ్రహంతోనే జ్ఞానం పొందడానికి అర్హత లభిస్తుంది."

న గురోరధికం న గురోరధికం న గురోరధికం నగురోరధికం
శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

సర్వం శ్రీగురుగుహాయార్పణమస్తు.

15, మే 2013, బుధవారం

జగద్గురు శ్రీ ఆదిశంకరభగవత్పాదాచార్య స్తవం - శృంగగిరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి విరచితం

శ్రీ గురుభ్యో నమః


II శృంగగిరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి విరచితం శ్రీ జగద్గురు శంకరభగవత్పాదాచార్య స్తవః II

ముదాకరేణ పుస్తకం దధాన మీశ రూపిణం
తథాఽపరేణ ముద్రికాం నమత్తమోవినాశినీం I
కుసుంభవాససా
ఽవృతం విభూతిభాసిఫాలకం
నతాఘనాశనే రతం నమామి శంకరం గురుమ్ II 1

పరాశరాత్మజప్రియం పవిత్రితక్షమాతలం
పురాణసారవేదినం సనందనాదిసేవితం I
ప్రసన్నవక్త్రపంకజం ప్రసన్నలోకరక్షకం
ప్రకాశితా
ఽద్వితీయ తత్త్వమాశ్రయామి దేశికమ్ II 2

సుధాంశుశేఖరార్చకం సుధీంద్రసేవ్యపాదుకం
సుతాదిమోహనాశకం సుశాంతిదాంతిదాయకం I
సమస్తవేదపారగం సహస్ర సూర్య భాసురం
సమాహితాఖిలేంద్రియం సదా భజామి శంకరమ్ II 3

యమీంద్రచక్రవర్తినం యమాదియోగవేదినం
యథార్ధ తత్త్వబోధకం యమాంతకాత్మజార్చకం I
యమేవ ముక్తి కాంక్షయా సమాశ్రయంతి సజ్జనాః
నమామ్యహం - సదా గురుం తమేవ శంకరాభిధమ్ II 4

స్వబాల్య ఏవ నిర్భరం య ఆత్మనో దయాలుతాం
దరిద్ర విప్ర మందిరే సువర్ణవృష్టి మానయన్ I
ప్రదర్శ్య విస్మయాంబుధౌ న్యమజ్జయత్సమాన్ జవాన్
స ఏవ శంకర స్సదా జగద్గురు ర్గతి ర్మమ II 5

యదీయ పుణ్య జన్మనా ప్రసిద్ధి మాప కాలడీ
యదీయ శిష్యతాం వ్రజన్ స తోటకోఽపి పప్రథే I
య ఏవ సర్వ దేహినాం విముక్తి మార్గదర్శకః
నరాకృతిం సదాశివం త మాశ్రయామి సద్గురుమ్ II 6

సనాతనస్య వర్త్మనః సదైవ పాలనాయ యః
చతుర్దిశాసు సన్మఠాన్ చకార లోక నిశ్రుతాన్ I
విభాండకాత్మజాశ్రమాది సుస్థలేషు పావనాన్
తమేవ లోకశంకరం నమామి శంకరం గురుమ్ II 7

యదీయహస్తవారిజాత సుప్రతిష్ఠితా సతీ
ప్రసిద్ధ శృంగభూధరే సదా ప్రశాంతి భాసురే I
స్వభక్తపాలనవ్రతా విరాజతే హి శారదా
స శంకరః కృపానిధిః కరోతు మా మనేనసమ్ II 8

ఇమం స్తవం జగద్గురో ర్గుణానువర్ణనాత్మకం
సమాదరేణ యఃపఠే దనన్య భక్తి సంయుతః I
సమాప్నుయా త్సమీహితం మనోరథం నరో
ఽచిరాత్
దయానిధే స్స శంకరస్య సద్గురోః ప్రసాదతః II 9

II ఇతి శృంగగిరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి విరచితం శ్రీ జగద్గురు శంకరభగవత్పాదాచార్య స్తవః సంపూర్ణం II

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.