15, సెప్టెంబర్ 2011, గురువారం

ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – పళముదిర్చోళై


ఆరు పడై వీడు – పళముదిర్చోళై సుబ్రహ్మణ్య స్వామి 
పాల మురుగన్
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మూడవది పళముదిర్చోళై. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు. నిజంగా ఇక్కడ సామి వారు ఎంతో బుజ్జిగా ముద్దులు మూట గడుతూ, చూడగానే నమస్కరించాలి అనే కంటే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే మా స్వామి “హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మ బంధో” కదా, అచ్చం మా అమ్మ జగన్మాత ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటారు.

ఆలయ ముఖ ద్వారం 
 ఈ క్షేత్రం మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. ఆ కొండ క్రిందే ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన “అళగర్ కోయిల్ ఉంది. ఈ అళగర్ కోయిల్ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటి. (అయితే మేము వెళ్ళినప్పుడు ఈ ఆలయము లో చాలా పెద్ద ఎత్తున మరమ్మత్తులు జరుగుతూ ఉండడం వల్ల, మాకు అళగర్ కొయిల్ లో మూల స్వరూప దర్శనం అవ్వలేదు.) కొండ క్రింద నుండి పైన సుబ్రహ్మణ్యుని ఆలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పై వరకు కార్లతో వెళ్ళవచ్చు.

ఆలయం వెలుపల దృశ్యం 

ఈ క్షేత్ర ప్రదేశం అంతా బాగా దట్టమైన అటవీ సంపదతో ఉంటుంది. ఈ ఆలయంలో స్వామి వారు, వల్లి, దేవయానీ అమ్మలు, విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రములో ఎప్పుడూ వానర సేన విపరీతంగా ఉంటుంది. అవన్నీ రామాయణం లో “గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, విలపంతి కేచిత్ ప్రహసంతి కేచిత్” అని వానరముల సంబరం తెలిపినట్లుగా ఈ ఆలయంలో అవి ఎప్పుడూ విపరీతంగా ఆడుతూ ఉంటాయి. ఎంతో ప్రశాంతముగా ఆలయం ఉంటుంది. ఎంతో మంది భక్తులు చిన్న చిన పిల్లలతోటి ఇక్కడికి వస్తూ ఉంటారు.

ఈ ఆలయం కంటే ఇంకా పైన కొండ మీద, నూపుర గంగ ఉంది, ఈ గంగ శ్రీ మహా విష్ణువు యొక్క పాద నూపురముల నుంచి వచ్చిందని, అందుకే ఆ పేరు అని చెప్పారు. అక్కడ ఎప్పుడూ చిన్న కొండ గుహ లోనుంచి గంగా జలము వస్తూనే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఆ జలము మా మీద కూడా ప్రోక్షించారు. కొంత మంది అయితే ఆ జలములలో శిరస్సు కూడా తడుపుకుని పునీతులయ్యారు. అక్కడే అమ్మ వారి (రక్కాయి అమ్మన్ అంటారు తమిళంలో) మూర్తి కూడా ఉంది.  

ఈ క్షేత్రము యొక్క స్థల వృక్షం రోజ్ ఆపిల్ చెట్టు. ఈ వృక్షము నుండి ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలప్పుడు ఫలములు వస్తాయి.  ప్రఖ్యాత తమిళ కవి అరుణగిరినాథర్ ఈ పళముదిర్చోలై సుబ్రహ్మణ్య స్వామి వారిని కీర్తిస్తూ పదహారు కీర్తనలు చేశారు. 

మనకి ఎన్ని ఐశ్వర్యములు, భోగాలు ఉన్నా, సరి అయిన ఆరోగ్యం లేక పోతే వ్యర్థం, ఈ క్షేత్రములో స్వామి వారిని దర్శించడం వల్ల, చక్కని ఆరోగ్యము మనకి కటాక్షించ బడుతుంది.


నిజంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో చెప్పాలంటే, ఈ ఆరు పడై వీడు – ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శిస్తే వచ్చే ఫలము ఏమిటంటే, ఏది మనలో బలమైన ఆసురీ గుణములు ఉన్నాయో వాటిని తీసి, మనలో దైవీ గుణములు కలిగేలా అనుగ్రహిస్తాడు స్వామి. మనలను ఎన్నో జన్మల నుంచి వెంటాడి వస్తున్న ఆరు షడూర్ములను తెసివేస్తాడు స్వామి. ఆ పైన మంచి బుద్ధిని ఇచ్చి, ఇష్ట కామ్యములను నెరవేర్చి, జీవితం యొక్క పథం ఉన్నతము వైపు నడిపిస్తాడు ఆ దేవసేనాపతి కార్తికేయుడు.

ఈ క్షేత్రమునకు సంబంధించిన ఒక కథ ఈ విధముగా ఉంది.
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం.


తమిళనాట అవ్వయ్యార్ అని ఒక తల్లి ఉండేది. ఒకనాడు ఆమె చాలా దూరం ప్రయాణించి అలసి పోయింది. బాగా ఎండగా ఉండడం వలన, నీడ కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందకి వచ్చింది. ఆమె అప్పటికే చాలా ఆకలి, దప్పికలతో ఉంది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవ్వయ్యార్ ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలి అనగానే, ఆ పిల్ల వాడు “నీకు వేయించిన పళ్ళు కావాలా, లేక వేయించకుండా కావాలా?” అని అడుగుతాడు. ఇతనెవరో మరీ తెలియని వాడిలా ఉన్నాడు, పళ్ళు వేయించినవి కావాలా అంటాడేమిటి అని, సరే పిల్లాడితో మాట్లాడే ఓపిక లేక, వేయించిన పళ్ళు ఇమ్మంటుంది అవ్వయ్యార్. వెంటనే ఆ పిల్లవాడు చెట్టును బలంగా కుదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయి. అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగా వేడిగా, వేయించినట్లు భావం  కలుగుతుంది  ఆమెకు. అప్పుడు వాటిని ఊదుకుంటూ (మట్టి తొలగడానికి) పళ్ళను తింటుంది. ఈ లీల చేసినది మామూలు పిల్లవాడు కాదు, ఎవరో మహాత్ముడు నాకు పాఠం చెప్పడానికే ఈ లీల చేశారు అని అనుకుని పైకి చూడగానే, ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అవుతారు. ఆమె జ్ఞాన భిక్ష పెట్టమని స్వామిని ప్రార్ధిస్తుంది.

స్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా చేసిన తంగ (బంగారు) రథం

ఈ క్షేత్రమును చేరే మార్గములు:
పళముదిర్చోళై తమిళనాడు లోని మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. అయితే ఈ క్షేత్రము, తిరుప్పరంకుండ్రం రెండూ మధురైకి వేరు వేరు దిక్కులలో ఉంటాయి.

రోడ్ ద్వారా: చెన్నై  - 450 Km, బెంగళూరు – 470 Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
రైలు ద్వారా: చెన్నై నుంచి మధురై కి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్, ఇది మన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లాంటి ట్రైన్. చెన్నై లో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మధురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.)
విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 Km), అది కాక జాతీయ విమానాశ్రయము మధురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 Km దూరంలో ఉంది.

వసతి సదుపాయము:
ఈ క్షేత్రము కూడా మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇందులోనే ఉన్నాము. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. TTDC వాళ్ళ వెబ్ సైట్ లంకె క్రింద ఇస్తున్నాను.

ఆలయంలో ఆర్జిత సేవలు:
ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. దీనికి కొంచెం ధరలో టికెట్టు ఉంటుంది, మనం కూడా పాలు, తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే, వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.

క్షేత్రము యొక్క వెబ్ సైట్:

పళముదిర్చోళై సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి వ్రాసిన ఈ టపాలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.

సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణమస్తు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి